Home / Politcs / 1600 టీఎంసీలు ఇచ్చాక తీసుకుపోండి

1600 టీఎంసీలు ఇచ్చాక తీసుకుపోండి

తెలంగాణ భవిష్యత్తు గోదావరి నదిపై ఆధారపడి ఉంది. కృష్ణాపరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత రోజురోజుకీ తగ్గుతున్నందున గోదావరే శరణ్యం. గోదావరిలో తెలంగాణ అవసరాలకు 1600 టీఎంసీల నీరు పక్కనపెట్టి, మిగిలిన నీటిని తీసుకోవచ్చని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి చెప్పినట్లు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నదుల అనుసంధానంపై బుధవారం ఇక్కడ జలవనరుల మంత్రి నితిన్‌గడ్కరీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్ల్యూడీఏ) సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. తొలుత మహానది నుంచి గోదావరి తర్వాత గోదావరి నుంచి కావేరీ అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలుండగా బుధవారం నాటి సమావేశంలో మహానది-గోదావరి అనుసంధానాన్ని రెండో దశలో తీసుకుంటామని చెప్పి తొలి దశకింద గోదావరి-కావేరి ప్రతిపాదనను అజెండాలో పెట్టారు. దీనిపై తెలంగాణ తరఫున మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నాలుగు అంశాలపై అభిప్రాయాలు చెప్పారు. అందులో 1. నీటి లభ్యత, నీటిమూలం (సోర్స్‌), ఎలా తరలిస్తారు (ట్రాన్స్‌మిషన్‌), ఎక్కడికి తరలిస్తారు (సింక్‌) 2. ప్రత్యామ్నాయ అవకాశాలు  3.తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం 4. పర్యావరణ అనుకూలంగా ఎలా చేస్తారు? అన్న అంశాలపై   మాట్లాడారు. సాయంత్రం తెలంగాణభవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమావేశ వివరాలు వెల్లడించారు.

నీటి లభ్యత
‘తొలుత సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ గోదావరిలో యేటా 2,500 నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్లు చెప్పారు. నిజంగా అంత నీరు సముద్రంలో కలుస్తున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా నదుల అనుసంధానానికి అనుకూలంగా ఉంటుంది. కృష్ణాలో రోజురోజుకీ నీటి లభ్యత తగ్గిపోతోంది. కృష్ణాలో 300 టీఎంసీల నికరజలాలు, 70 టీఎంసీల మిగులు జలాలపై ప్రస్తుతం తెలంగాణకు హక్కు ఉంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కర్ణాటకకు ఆలమట్టి ఎత్తుపెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దానివల్ల కర్ణాటక మరో 100 టీఎంసీలు ఆలమట్టిలో నిల్వచేసుకుంటే కిందికి కృష్ణానీరు రావడం మృగ్యమవుతుంది. ఆ పరిస్థితుల్లో కృష్ణాపరివాహక ప్రాంతంలో ఉండే తెలంగాణకూ గోదావరే దిక్కువుతుంది. ఈ నదిలో తెలంగాణకు 954 టీఎంసీల హక్కు ఉంది. హైదరాబాద్‌, మిషన్‌భగీరథ, తెలంగాణలోని పరిశ్రమల అవసరాలకూ గోదావరి నీరే శరణ్యం. ఈ అవసరాలు తీర్చడానికి గోదావరిలో మాకు 1500 నుంచి 1600 టీఎంసీలు అవసరమవుతాయి. అకినేపల్లి దిగువన సీతారామప్రాజెక్టు ఉంది. దాని నీటి అవసరాలు దెబ్బతినకూడదు. అందువల్ల 1600 టీఎంసీల గోదావరి నీటిపై తెలంగాణకు హక్కు ఇచ్చి మిగిలిన నీరు తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదు. తొలుత మహానదిని గోదావరితో అనుసంధానం చేసి కిందికి తీసుకెళ్తే మంచిది. అందువల్ల మహానది-గోదావరి-కృష్ణ-కావేరిలను ఒకేసారి అనుసంధానం చేయాలి.

40 ఏళ్ల లభ్యతను ప్రామాణికంగా తీసుకోవాలి
కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినప్పుడు సీడబ్ల్యూసీ 40 ఏళ్ల నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకొంది. ఇప్పుడు ప్రతిపాదించిన అకినేపల్లి బ్యారేజీకి మాత్రం 110 ఏళ్ల లభ్యత ఆధారంగా చేసుకొని అక్కడ 177 టీఎంసీల అదనపు నీటి లభ్యత ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ, వ్యాప్‌కోస్‌ వాళ్లు తేల్చారు. కాళేశ్వరం, కంతనపల్లికి 40 ఏళ్ల లభ్యతను ప్రామాణికంగా తీసుకొని.. దీనికి 110 ఏళ్లు ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. వాస్తవంగా 40 ఏళ్ల లభ్యతలో అకినేపల్లి దగ్గర నీళ్లు లేవు. అందువల్ల దాన్నే ప్రామాణికంగా తీసుకొని లెక్కించాలి. లేదంటే సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, మహారాష్ట్ర, తెలంగాణ చీఫ్‌ ఇంజినీర్లతో కమిటీ వేసి నీళ్లు ఉన్నట్లు తేల్చితే నదుల అనుసంధానానికి మాకు అభ్యంతరం లేదు. లేదంటే మహానది నీళ్లు తెచ్చి కిందికి తీసుకెళ్లండి. అకినేపల్లి దగ్గర నీటి లభ్యత లేదని మా రాష్ట్ర హైడ్రాలజీ విభాగం చెబుతోంది. అందువల్ల రాష్ట్ర అవసరాలను పక్కనపెట్టి మిగతా అవసరాలు తీర్చలేం.

ముంపునూ భరించలేం
అకినేపల్లి దగ్గర 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ కడతామంటున్నారు. అలాచేస్తే 35 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. 45 ఊళ్లు మునిగిపోతాయి. కాలువల కింద మరో 12 వేల ఎకరాలు మునుగుతుంది. ఇంతపెద్ద ముంపునకు మేం సిద్ధంగా లేం. తొలుత నీటి లభ్యత తేల్చితే ప్రత్యామ్నాయాలపై రెండోదశలో చర్చిస్తాం. నీళ్లున్నాయంటే ఎలా చేయాలో తర్వాతి దశలో ఆలోచిస్తాం. కేంద్రం ప్రతిపాదించిన దాంట్లో అటవీభూమి ఎక్కువ ఉంది. అది కూడా మంచిదికాదు’ అని ఈ సమావేశంలో చెప్పినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి మీటింగ్‌ పెట్టుకుందామని గడ్కరీ అన్నట్లు చెప్పారు. 40 ఏళ్ల లభ్యత ప్రకారం అక్కడ నీళ్లు లేవు కాబట్టి ప్రత్యామ్నాయాల ప్రసక్తే ఉండదని హరీష్‌రావు ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

గడ్కరీ అభినందించారు
సాగునీటిరంగంలో తెలంగాణ పనితీరును గడ్కరీ అభినందించినట్లు హరీశ్‌రావు చెప్పారు. ‘కాళేశ్వరం అద్భుతంగా చేస్తున్నారు. బడ్జెట్‌లో కూడా ఎక్కువ నిధులుపెట్టుకున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.. మీ పనితీరు బాగుంది’ అని ప్రశంసించినట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం చూడటానికి రమ్మని గడ్కరీ, జలవనరులశాఖ కార్యదర్శిని ఆహ్వానించామన్నారు. త్వరలో వస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. వేగవంతంగా అనుమతులిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపామని, ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలో పెండింగ్‌లో ఉన్న ఒకటి రెండు అనుమతులిప్పించాలని కోరినట్లు తెలిపారు. మిషన్‌ కాకతీయకు సంబంధించి త్రిపుల్‌ఆర్‌ ప్రోగ్రాం కింద నిధులు మంజూరుచేయాలని ప్రతిపాదనలు ఇచ్చామని, వెంటనే పరిశీలించి వాటిని మంజూరు చేయాలని గడ్కరీ తన అధికారులను ఆదేశించినట్లు హరీశ్‌రావు వెల్లడించారు.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by moviekillers.com